ఓ భగవాన్…నీ చిరునామా ఇదే కదా?!

ఓ భగవాన్,
ఇన్నాళ్లూ నీ చిరునామా ఎక్కడ? ఎక్కడ?! అని వెతికాను.
ఇప్పటికి నీ జాడ తెలిసిందిలే..

నులివెచ్చని సూర్యోదయం లో నీవే
చిరుగాలిలోని చల్లదనానివి నీవే
పారే సెలయేరులోని గలగలవి నీవే
పుడమివై నన్ను మోస్తుందీ నీవే
ఏ ఆకారమూ లేని ఆకాశానివి నీవే

ఓ దేవా,
నీవు ఎక్కడ లేవు?!
ఎటు చూసిన నువ్వే ..చైతన్యానివై అంతటా వ్యాపించి ఉన్నావు..
అందంగా ఎగురుతున్న ఆ పక్షుల రెక్కలలోని సత్తావి నీవే..
చిన్న చిన్న చీమల్ని నడిపించేది నీవే..
పెద్ద పెద్ద ఏనుగుల్ని కదిలించేది నీవే..
ఆకులలోని పచ్చదనానివి నీవే..
పూవులలోని సుకుమారానివి నీవే..

ఓ భగవాన్,
అమ్మ ప్రేమలోని కమ్మదనానివి నీవే
తోబుట్టువులలోని అనురాగానివీ నీవే
స్నేహం లోని మాధుర్యానివి నీవే
త్యాగమూర్తుల త్యాగం లోను నీవే
అమర ప్రేమికుల ప్రేమవీ నీవే

పసిపాప నవ్వులో నువ్వే
తాత బోసినవ్వులో నువ్వే

ఓ దేవా,
గానం నీవే, నాట్యం నీవే
సృష్టికర్తవూ, లయకారుడవూ నీవే.
సర్వ ప్రాణులను సృష్టించింది నీవే..రక్షించేది నీవే,
పోషించేవాడివీ నీవే, తిరిగి నీలో కలిపేసుకునేది నీవే..

ఓ పరమాత్మా,
నువ్వు అంతటా ఉన్నావు, అందరిలోనూ ఉన్నావు,
నాలో కూడా ఉన్నావు
కాని నాకు కనపడకుండా దోబూచులాడుతున్నావు

ఓ నా ప్రియాతి ప్రియమైన తండ్రి!!
నన్ను, నా అహాన్ని తొలగించుకుంటూ నాలోనే ఉన్న నిన్ను కలుసుకోవాలని ఉంది.
ఒక్కసారి నా కంటపడు
నీకు పాదాక్రాంతమై పోవాలని ఉంది
నీ రాకకై ఎదురుచూస్తూనే ఉంటాను
అప్పటిదాకా సూర్యోదయం లో నిన్ను చూసుకుంటూ ఉంటాను

Summary
ఓ భగవాన్...నీ చిరునామా ఇదా?!
Article Name
ఓ భగవాన్...నీ చిరునామా ఇదా?!
Description
Writer finding God in everything in the world!
Author
Publisher Name
Telugubhoomi
Publisher Logo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *